Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు విధించారు. లోక్‌సభ నుంచి ఆయన్ను డిస్క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు అయ్యింది. మార్చి 23వ తేదీ నుంచి అనర్హత వేటు అమలులోకి వస్తుందని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపారు. కాగా, రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. నిజాలు మాట్లాడే ప్రతి ఒక్కరినీ సభ నుంచి గెంటేస్తారు. కానీ, మేము నిజాలు మాట్లాడుతూనే ఉంటాం. హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బెదిరింపులకు భయపడము.. మౌనంగా ఉండము. మా డిమాండ్లు కొనసాగిస్తూనే ఉంటాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అని’ అని ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే ముద్ర చాలా దారుణం అని ఖర్గే అన్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ.. వీళ్లంతా బలహీన వర్గాల వారా..? అని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాహుల్ అనర్హత వేటు అంశంపై ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ అంశంలో న్యాయపరంగా, రాజకీయంగా ముందుకెళ్తామని చెప్పారు.