Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సంగారెడ్డి : ప్రయివేట్ పాఠశాలలో సిలబస్ అప్‌గ్రేడ్ చేసేందుకు లంచం తీసుకున్న సీనియర్ అసిస్టెంట్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడం సంగారెడ్డి జిల్లాలో సంచలనం కలిగించింది. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తన పాఠశాలకు ఉన్న ఎస్ఎస్సీ సిలబస్‌ను ఐసీఎస్ఈకి అప్‌గ్రేడ్ కోసం డీఈవోకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్‌గ్రేడ్ కోసం స్కూల్ యాజమాన్యం సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణతో చర్చలు జరిపింది. ఎన్వోసీ ఇవ్వడానికి లక్షా 10 వేల రూపాయలు డిమాండ్ చేయగా ముందుగా రూ. 50 వేలను ఇచ్చి మిగతా రూ.60 వేలు తరువాత ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ డబ్బును ఇవ్వడానికి ఇష్టం లేక స్కూల్ యాజమాన్యం ఈనెల 15న ఏసీబీని ఆశ్రయించింది.
ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం విద్యా శాఖ కార్యాలయంలోనే స్కూల్‌యాజమాన్యం సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణకు రూ. 50వేలు లంచం ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ డబ్బు డీఈవో రాజేశ్‌కు కూడా ఇవ్వనున్నట్లు సీనియర్ అసిస్టెంట్ వెల్లడించడంతో డీఈవోపై కూడా కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.