Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
మోడీ కళ్లలో తాను భయాన్ని చూశానని, అందుకే వాళ్లు నన్ను పార్లమెంటులో మాట్లాడకుండా చేశారని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. క్రిమినల్ డిఫమేషన్ కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడి లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారి రాహుల్‌గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ దృష్టిలో దేశమంటే అదానీ, అదానీ అంటే దేశమని ఆయన ఎద్దేవా చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు. నిబంధనలు మార్చి అదానీకి ఎయిర్‌పోర్టులు ఇచ్చారని, అదానీ షెల్ కంపెనీల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎవరు పెట్టారని ఆయన ప్రశ్నించారు. నేను ఇప్పటివరకు దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడానని, ఇకపై కూడా పోరాడుతూనే ఉంటానని ఆయన స్పష్టంచేశారు. అదానీ అంశంపై తాను మాట్లాడటం ప్రారంభించగానే కేంద్రం కుట్రలు మొదలుపెట్టిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పిచ్చి పనులకు తాను బెదిరేది లేదన్నారు. అంతేకాకుండా జీవితాంతం అనర్హత వేటు వేసినా, జీవితాంతం జైల్లో పెట్టినా తన పని తాను చేసుకుపోతూనే ఉంటానని అన్నారు. తానెప్పుడూ సోదర భావం గురించి మాట్లాడుతానని, నిజాలు మాట్లాడుతానని, నిజాలు మాత్రమే మాట్లాడుతానన్నారు.