Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మోడీ అనే ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించగా, పార్లమెంటు ఆయనపై అనర్హత వేటు వేయడం తెలిసిందే. దీనిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని అన్నారు.
విపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదని హితవు పలికారు. వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఉన్నప్పటికీ, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని షర్మిల విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని, ప్రతిపక్షాలపై అణచివేత తగదని వివరించారు.