Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కెనడా వ్యవహార శైలిపై కేంద్రం సీరియస్ అయింది. ప్రత్యేక ఖలిస్థాన్ అనుకూల వర్గాలు కెనడాలోని భారత దౌత్య మిషన్లు, కాన్సులేట్ల ముందు నిరసనకు దిగడం, దాడులకు పాల్పడడం తెలిసిందే. దీంతో కెనడా హై కమిషనర్ కు భారత సర్కారు సమన్లు జారీ చేసింది. వియన్నా కన్వెన్షన్ కింద కెనడా తన బాధ్యతలను నెరవేర్చాలని కోరింది. భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లపై దాడులకు దిగిన నేరస్థులను అరెస్ట్ చేసి, విచారించాలని డిమాండ్ చేసింది. ‘‘అసలు ఈ తరహా కార్యకలాపాలకు ఎందుకు అనుమతించారు. పోలీసుల సమక్షంలోనే మా డిప్లోమాటిక్ మిషన్లు, కాన్సులేట్ల వద్ద భద్రతను ఉల్లంఘించారు’’అని పేర్కొంటూ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్ వద్ద భద్రతకు భరోసానిచ్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను కెనడా సర్కారు తీసుకుంటుందని భావిస్తున్నట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.