Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు జోష్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి వరుస కార్యక్రమాలకు అధిష్టానం ప్రణాళిక రచించింది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు - ప్రజా సమస్యలపై పోరాటాలు - సంస్థాగత కార్యక్రమాల కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనుంది. సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్‌లో పొలిట్‌బ్యూరో మీటింగ్ జరగనుంది. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్‌బ్యూరో సమావేశంలో నేతలు చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.
టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మార్చి 29న హైదరాబాద్‌లో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే సభకు రెండు రాష్ట్రాల టీడీపీ నేతలు హాజరుకానున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో విశాఖ, నెల్లూరు, కడప జిల్లాల్లో పార్టీ.. జోన్-1, జోన్ -4, జోన్ -5 సమావేశాలు నిర్వహించనున్నారు. జోన్ సమావేశాల అనంతరం పార్టీ అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర నాయకత్వం అంతా మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు.