Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: తృటిలో గగనతలంలో భారీ ప్రమాదం తప్పింది. రెండు విమానాలు గాలిలోనే ఢీకొనబోయి సకాలంలో రాడార్ హెచ్చరిక సంకేతాలతో తప్పించుకున్నాయి. దీంతో గగనతలంలో భారీ ప్రమాదం తప్పినట్టయింది. సంఘటన వివరాల ప్రకారం, నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A-320 కౌలాలంపూర్ నుంచి ఖాట్మండూ వస్తుండగా, ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ నుంచి ఖాట్మండూ వస్తోంది. రెండూ దాదాపు దగ్గరగా వచ్చాయి. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తునుంచి కిందకు దిగుతోంది. నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. దీనిపై రాడార్ సంకేతాలు ఇవ్వడంతో ఇరు విమానాల పైలట్లు అప్రమత్తమయ్యారు. నేపాల్ విమానం వెంటనే ఏడు వేల అడుగులకు దిగడంతో ప్రమాదం తప్పిందని నేపాల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.