Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో 3 కేసుల్లో విచారణకు హాజరు కావాలని కోరుతూ ఝార్ఖండ్ దిగువ కోర్టులు సమన్లు జారీ చేశాయి. మోడీ వంశంపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఓ కేసు నమోదు కాగా అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గానూ మిగిలిన రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ 1, 3, 5 తేదీల్లో విచారణకు రావాలంటూ రాహుల్‌కు కోర్టులు సమన్లు జారీ చేశాయి.
2019లో ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ 'మోడీలందరూ దొంగలని' అన్నారు. రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ ప్రదీప్ మోడీ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోడీ వంశంపై చేసిన ఇదే తరహా వ్యాఖ్యలకు గానూ సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో తన కేసును కూడా త్వరగా విచారించాలని ప్రదీప్ మోడీ కోర్టును కోరారు.
2021లో ప్రదీప్ మోడీ దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఏప్రిల్ 1న విచారణకు హాజరుకావాలని రాంచీలోని దిగువ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. రెండు కేసులు రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు, చైబాసా కోర్టులో నమోదైయ్యాయి. నవీన్ ఝా, ప్రదీప్ కుమార్ అనే పిటిషనర్లు ఈ రెండు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. 2018లో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ అమిత్ షా 'హంతకుడు' అని అన్నారు. దీంతో నవీన్ ఝా, ప్రదీప్ కుమార్‌లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే నవీన్ ఝా పిటిషన్‌ను ఏప్రిల్ 5న, ప్రదీప్ కుమార్ పిటిషన్‌ను ఏప్రిల్ 3న విచారించనున్నాయి.