Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇంటి వద్ద భారీగా నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చారు. వందలాది నిరసకారులను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యా, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్సీ వర్గాలకు కేటాయించిన 17 శాతం రిజర్వేషన్లను ఉప వర్గాల వారీగా విభిజించాలని సూచించింది. కాగా, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బంజారా, ఇతర వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తాము నష్టపోతామని బంజారా సంఘం నాయకులు ఆరోపించారు. కేంద్రానికి చేసిన సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శివమొగ్గ జిల్లాలోని షికారిపురాలో బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ఇల్లు, కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం బంజారా, భోవి సంఘాలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో కొందరు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా మహిళలతో సహా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.