Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు జరిగింది. రాజధాని కాబూల్‌లోని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం ముందు సోమవారం పేలుడు సంభవించింది. మాలిక్ అస్గర్ స్క్వేర్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఒక అనుమానాస్పద వ్యక్తిని భద్రతా దళాలు గుర్తించాయి. ఇంతలో అతడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. బాంబులతో తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ సంఘటనలో ఆరుగురు మరణించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో మూడు నెలల్లో రెండో ఆత్మాహుతి దాడి జరిగినట్లు పేర్కొంది. కాగా, కాబూల్‌లోని ఇటలీకి చెందిన ప్రభుత్వేతర సంస్థకు చెందిన ఎమర్జెన్సీ ఆస్పత్రికి రెండు మృతదేహాలతోపాటు గాయపడిన 12 మందిని తరలించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. మరోవైపు సూసైడ్ బ్లాస్ట్‌లో మరణించిన ఆరుగురూ పౌరులేనని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారిలో ముగ్గురు ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ దాడికి బాధ్యులు ఎవరన్నది ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని పేర్కొంది. అయితే ఐఎస్ఐఎస్ పనిగా తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ ప్రభుత్వం అనుమానిస్తున్నది.