Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బలగం సినిమా డైరెక్టర్ యెల్దండి వేణును మంత్రి కేటీఆర్ అభినందించారు. తాను ‘బలగం’ సినిమా చూశానని, అద్భుతంగా తీసినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం అనంతరం, అక్కడికి వేణును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి స్వయంగా ఆలింగనం చేసుకుని, శాలువాతో సత్కరించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని అభినందించారు. తక్కువ బడ్జెట్‌తో సమాజానికి దోహదపడేలా ‘బలగం’ లాంటి సినిమాలు తీయాలని, కమర్షియల్ సినిమాల వైపు ఇప్పుడే వెళ్లొద్దని వేణుకు సూచించారు. మంచి సినిమాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, దీనికి ఉదాహరణ ‘బలగం’ సినిమానే అని పేర్కొన్నారు. తాను గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సినిమా భారీ విజయం కావడం సంతోషంగా ఉందన్నారు. తన నియోజవర్గానికి చెందిన వేణు సిరిసిల్ల ఖ్యాతిని ‘బలగం’ సినిమాతో పెంచారని ప్రశంసించారు. మంచి సినిమాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, వేణు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు డైరెక్టర్ వేణు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రితో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా, మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్లో సెల్ఫీ తీసి ఇవ్వడం గమనార్హం. ఇక్కడ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ ఉన్నారు.