Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: నగరంలో మళ్లీ పోస్టర్ వార్ ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ఈ పోస్టర్ వార్ అడపా దడపా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే నేడు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ - నారపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభమై ఏళ్లకేళ్లు గడుస్తున్నా కనీసం సగం కూడా పూర్తి కాలేదు. దీనిని విమర్శిస్తూ ‘మోడీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..?’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారంటూ ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలైనా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ 40 శాతం కూడా పూర్తికాలేదని పోస్టర్‌పై పేర్కొన్నారు. ఫ్లైఓవర్ పిల్లర్లపై మోడీ చిత్రపటాన్ని వేసి మరీ పోస్టర్లలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిలో ఫ్లై ఓవర్ పిల్లర్లకు వీటిని గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. అలాగే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న ప్లైఓవర్ పిల్లర్లపై కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. మొత్తానికి ఆరు కిలోమీటర్ల మేర ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్లపై అడుగడుగునా మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.