Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఇంటిపేరుపై కామెంట్స్‌కు సంబంధించిన కేసులో ఇటీవల సూరత్ కోర్టు కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో లోక్‌సభ సెక్రెటేరియట్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అచ్చం అదే మాదిరిగా గత జనవరిలో ఎంపీ పదవిని కోల్పోయి, ఇవాళ మళ్లీ దక్కించుకున్న మహ్మద్ ఫైజల్ అంశం చర్చనీయాంశమైంది. పై కోర్టు తీర్పుతో రాహుల్‌గాంధీపై కూడా అనర్హత వేటు తొలగిపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ ఫైజల్‌కు గత జనవరి 11న కవరత్తి కోర్టు జైలుశిక్ష విధించింది. దాంతో జనవరి 12న లోక్‌సభ సెక్రటేరియట్ ఆయన పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. అయితే, కవరత్తి కోర్టు తీర్పును మహ్మద్ ఫైజల్ కేరళ హైకోర్టులో సవాల్ చేశాడు. దాంతో కేరళ హైకోర్టు కింది కోర్టు తీర్పుపై స్టే విధించింది. ఈ క్రమంలో ఇవాళ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ విషయంలో కూడా ఇదే జరుగుతుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా, పార్లమెంట్లో తన సభ్యత్వం రద్దు, పునరుద్ధరణ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై మహ్మద్ ఫైజల్ ఫైరయ్యారు. కోర్టు జైలుశిక్ష వేసిన తర్వాత రోజే తన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసిన లోక్‌సభ సెక్రటేరియట్, కేరళ హైకోర్టు స్టే ఇవ్వగానే మళ్లీ ఎందుకు పునరుద్ధించలేదని ప్రశ్నించారు. తన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణకు రెండు నెలలకుపైగా సమయం ఎందుకు పట్టిందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం నియంత ధోరణిని అవలంభిస్తూ విపక్ష పార్టీలపై కక్ష సాధిస్తున్నదని ఆరోపించారు. రాహుల్‌గాంధీ విషయంలో కూడా కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించిందని, ఆయన లోక్‌సభ సభ్యత్వం కూడా పునరుద్ధించబడుతుందని ఫైజల్ వ్యాఖ్యానించారు.