Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హనుమకొండ
జిల్లాలోని పరకాల పట్టణ శివారు భూపాలపల్లి రోడ్డులోని చలివాగు బ్రిడ్జి వద్ద బుధవారం వ్యవసాయ కూలీలు, ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామానికి మిర్చి ఏరేందుకు వెళ్తున్నారు. పరకాల పట్టణం దాటి చలివాగు బ్రిడ్జి సమీపిస్తుండగా భూపాలపల్లి నుంచి పరకాలకు వస్తున్న కారు అతి వేగంగా వచ్చి ఆటో ను ఢీ కొట్టి రోడ్డు కిందకు దూసుకుపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యవసాయ కూలీలు రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయారు.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మొగ్గం సమ్మక్క, కొంగరి చేరాలు, దుబాసి కోమల, దుబాసి సూరమ్మ, పసుల భిక్షపతి, కొంగరి లక్ష్మి, నాలికి స్వరూప, సిలివేరు కొమురమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటినా పరకాలలోని సివిల్ ఆస్పత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న వారిలో కొంగరి చేరాలు (57), దుబాసి కోమల(56) అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా, సిలివేరు కొమురమ్మ పరిస్థితి విషమంగా ఉంది ఈమెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.