Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: యూట్యూబ్ చానళ్ల ద్వారా మహిళలను కించపరుస్తూ.. సోషల్ మీడియాలో ఆ చానల్స్ ద్వారా ట్రోల్స్ చేస్తున్న కేటుగాళ్ల ఆటను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కట్టించారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలను టార్గెట్‌గా చేసుకుంటూ.. వారిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న 20 యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులపై కేసులు పెట్టారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. సైబర్‌క్రైమ్స్ విభాగం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి, బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ స్నేహ వివరాలను వెల్లడించారు. సెలబ్రిటీలు, ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ.. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, యూట్యూబ్ చానళ్లలో అసభ్యంగా చిత్రీకరించడం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై సైబర్‌క్రైమ్స్ విభాగానికి ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్స్ బృందం.. ఐపీ అడ్ర్‌సల ఆధారంగా నిందితులను గుర్తించింది. నిందితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారని నిర్ధారించుకుని, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుంది. వీరంతా 20-30 ఏళ్ల మధ్య వయసువారు కావడం గమనార్హం..! వారికి నోటీసులు ఇచ్చి, వదిలిపెట్టినట్లు.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ వెల్లడించారు. మిగతా చానళ్ల నిందితులను కూడా గుర్తిస్తున్నామన్నారు.