Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏలూరు
ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. రైలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో సుమారు 4 గంటలపాటు రైలు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. దురంతో ఎక్స్‌ప్రెస్ వస్తుండటంతో భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అదే సమయంలో బొలెరోలో వచ్చిన కొంతమంది వ్యక్తులు వాహనంతో రైల్వే గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ వాహనం రైల్వే ట్రాక్‌పైకి వచ్చింది. అదే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ సమీపించడంతో సదరు వ్యక్తులు బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. రైలు ఢీకొనడంతో ఆ వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనపై రైల్వేపోలీసులు విచారణ చేపట్టారు. బొలెరో వాహనంలో వచ్చినవాళ్లు దొంగలా? పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా? లేదా మరేదైనా కారణమా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.