Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కార్యాలయానికి పిలిచి శంకరలక్ష్మి నుంచి వివరాలు సేకరించిన అధికారులు షమీమ్, రమేష్ చెప్పిన వివరాలను నిర్ధారించుకోవడానికి మరోసారి ఆమెను ప్రశ్నిస్తున్నారు. శంకరలక్ష్మి తన డైరీలో రాసుకున్న లాగిన్ పాస్ వర్డ్‌ను ప్రవీణ్, రాజశేఖర్ దొంగిలించి కంప్యూటర్ లోకి లాగిన్ అయ్యారని, కంప్యూటర్లో ఉన్న పేపర్లను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నారని ఇప్పటిదాకా నిర్ధారించారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్‌ను ప్రవీణ్ షమీమ్, రమేష్‌కు ఇవ్వగా, రాజశేఖర్ రెడ్డి సురేష్, ప్రశాంత్ రెడ్డికి ప్రశ్నాపత్రాన్ని ఇచ్చాడని అధికారులు గుర్తించారు. తమకు ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని షమీమ్, రమేష్ అడిగినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే తమకు ప్రశ్నాపత్రం ఇవ్వాలని షమీమ్ అడిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు శంకరలక్ష్మి నుంచి అధికారులు మరి కొన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ తరుణంలోనే ఎల్ బీ నగర్ లోని షమీమ్ నివాసంలో సిట్ సోదాలు ముగిశాయి. షమీమ్ ఇంట్లో సిట్ అధికారులు గంట పాటు సోదాలు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ తరువాత ఇంటి నుంచి ఎవరెవరితో మాట్లాడారనే వివరాలు సేకరించారు. సురేష్, రమేష్.. షమీమ్ ఇంటికి ఎప్పుడెప్పుడు వచ్చారనే వివరాలు సేకరించారు. షమీమ్ నివాసంలో ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు.