Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అన్నారు. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మెడిసిన్స్‌తో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుందని హరీశ్‌రావు తెలిపారు.
సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని మంత్రి మండిపడ్డారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైంది. ఇది అత్యంత బాధాకరం. దుర్మార్గమైన చర్య అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.