Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో సారి మండిపడ్డారు. ప్రధాని ప్రాధాన్యతలో తెలంగాణ లేదని అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాధాన్యతలో మాత్రం ప్రధాని ఎందుకుండాలని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ ఇచ్చేది లేదని మోడీ సర్కారు తేల్చి చెప్పిందన్నారు.
తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని మోడీ చెప్పారు. మెట్రో రెండో దశ, ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చేశారు. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను మోడీ అమలు చేయట్లేదు. వీటన్నింటికీ రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలి. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు కానీ, ప్రధాని రాష్ట్రం గుజరాత్‌కు లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి రూ.20వేల కోట్లు ఇచ్చారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితమిది’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.