Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల అంతరిక్షం నుంచి భూమి చిత్రాలు తీసింది. ఓషన్‌శాట్-3గా పిలిచే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ద్వారా తీసిన అద్భుతమైన భూమికి సంబంధించిన చిత్రాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఓషన్ కలర్ మానిటర్ సాంకేతికతో కూడిన మొజాయిక్ చిత్రాలను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రూపొందించినట్లు ఇస్రో తెలిపింది. భూమి, ప్రత్యేకంగా భారత్ దేశానికి సంబంధించిన ఈ చిత్రాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ద్వారా తీసిన సుమారు మూడు వేల ఇమేజ్‌లను ఓషన్ కలర్ మానిటర్ సాంకేతికతో కూడిన మొజాయిక్ చిత్రాలుగా రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. భూమిపై ఉన్న మహాసముద్రాలు, సముద్ర జీవజాలం, ప్రపంచ వృక్ష సంపదకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఓషన్‌శాట్-3 ద్వారా భూమిని 13 విభిన్న తరంగ దైర్ఘ్యాలతో చిత్రీకరించినట్లు వివరించింది. మంత్రముగ్దులను చేసే ఈ చిత్రాలను ట్విట్టర్లో ఇస్రో పోస్ట్ చేసింది. కాగా, ఇస్రో బుధవారం పోస్ట్ చేసిన భూమికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క రోజులోనే సుమారు 4.5 లక్షల మంది వీటిని వీక్షించారు. ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఇస్రోను ప్రశంసించారు. భారతీయుడిని కావడం గర్వంగా ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. భూమితోపాటు మార్స్‌కు సంబంధించిన మరిన్ని శాటిలైట్ చిత్రాలను పోస్ట్ చేయాలని మరొకరు కోరారు.