Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలోని శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని పటేల్ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్ జులేలాల్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఉన్న మెట్లబావి స్లాబ్పై భక్తులు కూర్చున్నారు. భక్తుల బరువును ఆపలేకపోయిన ఆ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఓ 30 మంది భక్తులు మెట్లబావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో బావిలో పడ్డ వారిని బయటకు తీసుకొచ్చారు పోలీసులు. అయితే బావిలో పడ్డ వారిలో 12 మంది మృతి చెందగా, మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బావి లోతు 50 అడుగులపైనే ఉండటంతో భక్తులకు తీవ్ర గాయాలైనట్లు పోలీసుల విచారణలో తేలింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో అధికంగా మహిళలే ఉన్నారు.
ఆలయ ఆవరణలో ఉన్న మెట్ల బావి నిరూపయోగంగా ఉండటంతోనే దానిపై స్లాబ్ వేశారు. అనంతరం దాన్ని ఆలయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఒకేసారి అధిక సంఖ్యలో భక్తులు కూర్చోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.