Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో గురువారం కీలక విషయం బయటపడింది. గ్రూప్-1 సహా ఆరు పరీక్షలకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్‌షీట్లను కూడా కాపీ చేసుకున్నట్టు సిట్ విచారణలో నిందితులు వెల్లడించినట్టు తెలిసింది. ప్రశ్నలతోపాటు సమాధానాలను కూడా మిగతా నిందితులకు ఇవ్వడంతో గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి వారే పరీక్షలకు సిద్ధమైనట్టు వెల్లడైంది. కస్టోడియన్ సిస్టమ్ నుంచి ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ఆరు పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్నపత్రాలను, వాటి సమాధానాలను కాపీ చేసుకున్నారు. ఆయా పరీక్షలకు వారం రోజుల ముందే తమ వారికి ప్రశ్నపత్రం అందేలా ప్లాన్ చేసుకున్నారు.
గ్రూప్-1లో వందకుపైగా మార్కులు తెచ్చుకున్న సురేశ్, రమేశ్, షమీమ్‌కు పరీక్షకు వారం రోజుల ముందు ప్రశ్నపత్రం అందించినట్టు విచారణలో వెల్లడించారు. ఈ ముగ్గురిని ఐదురోజుల కస్టడీకి తీసుకున్న సిట్ రెండోరోజు గురువారం విచారించింది. నిందితుల ఇండ్లలో సిట్ సోదాలు నిర్వహించింది. పరీక్షకు సిద్ధమైన ప్రశ్నపత్రాలు, సమాధానాల కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురు మూడు జిరాక్స్ కాపీలు తీసుకొని, సమాధానాలు కూడా అక్కడే ఉండటంతో ఆయా ప్రశ్నలను బట్టి పట్టినట్టు సిట్ విచారణలోతెలిసింది. నిందితులు చెప్పే అంశాలను ధ్రువీకరించుకోవడానికి కస్టోడియన్ శంకర లక్ష్మిని కూడా సిట్ విచారించింది.