Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ఈ బెదింపులు వచ్చాయని ఆయన ఆరోపించారు. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా మాదిరిగానే తననూ చంపేస్తామని వారు హెచ్చరించారని రౌత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
'లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కొందరు నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఢిల్లీకి వస్తే ఏకే-47 తుపాకీతో కాల్చి చంపేస్తామని వారు హెచ్చరించారు. మూసేవాలాకు పట్టిన గతే నాకూ పడుతుందన్నారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశా' అని రౌత్ మీడియాకు తెలిపారు. అయితే ఈ విషయంపై తాను ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించట్లేదని ఆయన ఆరోపించారు. 'గతంలోనూ నాకు ఇలాగే బెదిరింపులు వచ్చాయి. కానీ రాష్ట్ర హోంమంత్రి ఇది కేవలం స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు' అని రౌత్ దుయ్యబట్టారు. కాగా.. రౌత్ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్ నంబరును ట్రేస్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.