Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ్ముడు వివాహేతర సంబంధానికి అన్న బలయ్యాడు. తమ్ముడు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తరుపు బంధువులు అన్నను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన చంద్రగిరి మండలం గంగుడుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నాగరాజు(36)ను అతని తమ్ముడు పక్కా ప్లానింగ్ తో హతమార్చారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. పురుషోత్తం స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మహిళ బంధువులకి పురుషోత్తంకి మధ్య తరచూ గొడవలు అవుతుండటంతో ఇకపై గొడవలు లేకుండా చేస్తామని నమ్మించి అన్న నాగరాజును మద్యం తాగించటానికి తీసుకువెళ్లి దుండగులు హత్య చేశారు. నాగరాజును కొట్టి, కాళ్ళు చేతులు కట్టేసి, కార్ డోర్ లాక్ చేసి కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టి సజీవ దహనం చేశారు. కారులో మంటలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అప్పటికే కారు మంటల్లో కాలిపోయింది. సంఘటన స్థలంలో చల్లాచదురుగా రోడ్డుపై మెడలోని చైన్, దుస్తులు, చెప్పులు పడివుండటంతో పోలీసులు హత్య చేసినట్లు గుర్తించారు. అయితే.. సజీవ దహనం చేసి కారును లోయలోకి తోసి ప్రమాదంగా దుండగులు చిత్రీకరించే యత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు, క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.