Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని మండిపడ్డారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు అక్కడి కార్మికులు, అనేక ఇతర సంఘాలు, భారత రాష్ట్ర సమితి వంటి పార్టీలు అడ్డుకుంటున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని వెల్లడించారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని మంత్రి మరోసారి కుండబద్దలు కొట్టారు. కేవలం కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ తన ఎజెండా అమలు కోసం మాత్రమే స్టీల్‌ప్లాంట్‌ను క్రమంగా చంపే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తుందన్నారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడటం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టంచేశారు. స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నదన్నారు.