Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు: డిమాండ్ చేసిన రూ.2 లక్షలు ఇవ్వనందుకు ఒక ముస్లిం వ్యక్తిని గో సంరక్షకులు కొట్టి చంపారు. బీజేపీ పాలిత కర్ణాటకలో ఈ దారుణం జరిగింది. పశువుల వ్యాపారి ఇద్రిస్ పాషా, శనివారం ఒక వాహనంలో పశువులను తరలిస్తున్నాడు. పునీత్ కెరెహళ్లి నేతృత్వంలోని ఆవు సంరక్షకులు ఆ ముస్లిం వ్యక్తిని అడ్డుకున్నారు. అయితే పశువుల సంత నుంచి కొన్న వాటిని తరలించేందుకు అనుమతి ఉన్న పత్రాలను ఇద్రిస్ పాషా వారికి చూపించాడు. అయినప్పటికీ పునీత్, అతడి అనుచరులు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఇద్రిస్ పాషాను గో రక్షకులు దారుణంగా కొట్టి చంపారు. కాగా, రామనగర జిల్లాలోని సాత్నూర్ గ్రామం వద్ద రోడ్డు పక్కన పడి ఉన్న ఇద్రిస్ పాషా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. గో సంరక్షకులు పునీత్, అతడి అనుచరులపై హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నియోజవర్గంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.