Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహారాష్ట్ర
కరెన్సీ నోట్ల దండలోని డబ్బులు వెదజల్లుతున్న ఈ వ్యక్తి మహారాష్ట్రలో ఓ గ్రామ సర్పంచి. పైసలు ఎక్కువయ్యో.. ఏదో ఉత్సవం సందర్భంగానో.. ఆయన ఇలా చేయడం లేదు. రైతులకు బావులు మంజూరు చేయడానికి పైఅధికారి లంచం డిమాండ్ చేయడంతో.. పెల్లుబికిన ఆగ్రహంతో ఇలా నిరసన తెలిపారు. ఆయన శంబాజీనగర్ జిల్లా పులంబ్రీ పంచాయతీ సమితి పరిధిలోని గోవరాయ్ పయాగ్ గ్రామసర్పంచి మంగేష్ సాబడే. ఆ గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరయ్యాయి. ఒక్కోబావికి రూ.4 లక్షలు కేటాయించారు. వాటి పనులు ప్రారంభించాలంటూ మంగేష్ పలుమార్లు బీడీవో (బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్) జ్యోతి కవడదేవికి విన్నవించారు. ఒక్కోబావికి రూ.48 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులంతా పేదవారని.. సర్పంచి వేడుకున్నా ఆమె కనికరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన రూ.100, రూ.500 నోట్లతో రూ.2 లక్షల దండ మెడలో వేసుకొని శుక్రవారం సమితి కార్యాలయం ముందు ఆ డబ్బు వెదజల్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మంత్రి గిరీష్ మహాజన్ బీడీవోను సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదివారం ఆదేశించారు. తాను వెదజల్లిన డబ్బు పేదప్రజల నుంచి సేకరించిందేనని.. ఆ మొత్తాన్ని కూడా బీడీవో నుంచి వసూలు చేసి ఇప్పించాలని సర్పంచి కోరారు.