Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జోగుళాంబ గద్వాల
కన్న బిడ్డలకు ఈత నేర్పించాలన్న తపనతో వ్యవసాయ బావికి వెళ్లిన తండ్రి, కూతురు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిలాల్లో చోటు చేసుకుంది. జిల్లాలోని మల్దకల్ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన రైతు రమేశ్‌రెడ్డి మామిడి తోటలో అయిజ మండలం తూంకుంటకు చెందిన తెలుగు రాముడు (40) పని చేస్తున్నాడు. భార్య, కుమారుడు, కుమార్తె వెన్నెల(5)తో కలిసి పొలంలోనే ఉంటున్నాడు. ఆదివారం భార్య కూలి పనికి వెళ్లగా ఇద్దరు పిల్లలకు ఈత నేర్పించడానికి రాముడు సమీపంలోనే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ బావి కి వెళ్లాడు. అక్కడ బావిలో కొడుకు నడుముకు డబ్బా కట్టి బావిలో దించాడు. తర్వాత కూతురిని పట్టుకొని ఈత కొట్టించేందుకు బావిలోకి దిగాడు.
అయితే భయంతో కూతురు, తండ్రి గొంతును గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు బావిలో మునిగిపోయారు. కుమారుడికి డబ్బా కట్టి ఉండడంతో భయంతో ఒడ్డుకు చేరాడు. కొడుకు ఏడుస్తుండడంతో గమనించిన స్థానికులు విషయం తెలుసుకొని పోలీసులకు తెలిపారు. బావి వద్దకు చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. నీరు పుష్కలంగా ఉండడంతో ఐదు మోటార్ల సహాయంతో నీటిని బయటకు తొలగించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గద్వాల దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.