Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయ్‌పూర్: రాజకీయ నేతలు కిక్కిరిసి ఉన్న స్టేజ్ కూలింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, పలువురు నేతలు గాయపడ్డారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గుజరాత్‌లోని సూరత్ కోర్టు పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ బిలాస్పూర్లో ఆదివారం కాగడాలతో ర్యాలీ నిర్వహించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్థానిక గాంధీ చౌక్ నుంచి దేవకినందన్ చౌక్ వరకు నిరసన ర్యాలీ సాగింది. కాగా, ర్యాలీ అనంతరం దేవకినందన్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో ఆ స్టేజీ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ సంఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శైలేష్ పాండే, రష్మీ సింగ్‌తోపాటు మరికొందరు పార్టీ నేతలు గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారికి వైద్య సేవలందించారు.