Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారీ విమానం సైజు ఉన్న గ్రహశకలం ఒకటి భూమి వైపు ప్రచండ వేగంతో దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలం కదలికలను చాలా ఆలస్యంగా గుర్తించినట్లు తెలిపింది. ఫిబ్రవరిలో ఈ గ్రహశకలాన్ని గుర్తించామని, అప్పటి నుంచి దీని కదలికలపై నిరంతర నిఘా పెట్టినట్లు వివరించింది. ఈ గ్రహశకలానికి నాసా శాస్త్రవేత్తలు 2023ఎఫ్ జెడ్3 గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది గంటకు 67వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని వివరించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, ఇది గురువారం నాడు భూమికి 41 లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్లిపోతుందని తెలిపారు. అంతరిక్షంలో చిన్నా పెద్ద కలిపి మొత్తం 30 వేలకు పైగా గ్రహశకలాలు చక్కర్లు కొడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో సుమారు 850 శకలాలు భారీ పరిమాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. కిలోమీటర్ల కొద్దీ పొడవున్న శకలాలు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. అయితే, మరో వందేళ్ల వరకూ ఈ గ్రహశకాలలతో భూమికి వచ్చే ముప్పేమీ లేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, మంగళ, బుధ వారాల్లో కూడా నాలుగు చిన్న చిన్న గ్రహశకలాలు భూమికి దగ్గర్లో నుంచి దూసుకెళతాయని చెప్పారు.