Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, బండిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకొని నానా హంగామా సృష్టించారు. దీంతో పోలీసులను భారీగా మోహరించి బండి సంజయ్‌ని అక్కడి నుంచి హైదరాబాద్ వైపు తరలించారు. కరీంనగర్ దాటిన తర్వాత ఎల్ఎండీ వద్ద వాహనం మొరాయించడంతో మరో వాహనంలో బండిని తరలించారు.
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం పదోతరగతి హిందీ పేపర్‌ను పరీక్ష కేంద్రం నుంచి బయటకు తెచ్చిన వ్యవహారంలో ప్రధాన నిందితుడైన బీజేపీ కార్యకర్త బూరం ప్రశాంత్ ఆ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్‌కి వాట్సాప్‌ద్వారా పంపినట్టు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం కూడా ప్రశాంత్‌తో బండి సంజయ్ ఫోన్లో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయి. దీంతో బండిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నా రు. అంతకుముందు పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో బండి సంజయ్ మంగళ వారం అర్ధరాత్రి సిద్దిపేటలో ఆగకుండానే కరీంనగర్ వైపు వెళ్లిపోయారు. అర్ధరాత్రి ఆయన హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ సిద్దిపేటలోని రంగధాంపల్లి అమర వీరుల స్తూపం వద్ద మీడియాతో మాట్లాడతానని తెలిపారు. దీంతో మీడియా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రంగధాం పల్లి వద్దకు రాగానే అక్కడి పరిస్థితిని చూసిన బండి సంజయ్ తనను అడ్డుకుంటారనే భయంతో ఆగకుండానే ముందుకు వెళ్లిపోయారు. దీంతో అక్కడ చేరిన వారంతా ‘బండి దొంగ.. దొంగ.. పారిపోతున్నాడు, అరెస్టు చేయండి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బండి తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్న బండిని శిక్షించాలని డిమాండ్ చేశారు.