Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నీట్’కు సిద్ధమవుతున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటిదాకా స్నేహితురాళ్లతో మాట్లాడి.. తాను ధరించిన డ్రెస్సు బాగుందా అని వారిని అడిగిన అమ్మాయి, ఆ తర్వాత ఐదు నిమిషాలకే తాను కోచింగ్ తీసుకుంటున్న సెంటర్ భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది! హైదరాబాద్ హయత్‌నగర్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాలు కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల విద్యా ప్రియాంక. తన కుమార్తెను కులం పేరుతో వేధించారని.. ‘మీ కులం వారికి చదువెందుకు?’ అంటూ హేళన చేయడంతోనే ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి వద్ద గల దవావో మెడికల్ అకాడమీలో విద్యా ప్రియాంక చదువుతోంది. నీట్ కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకోవాలనుకుంది. ఇందుకు హయత్‌నగర్ కుంట్లూరు రోడ్డు ప్రగతినగర్‌లోని ఓ భవనం రెండో అంతస్తులో నిర్వహిస్తున్న ‘ఐ అకాడమీ’లో చేరింది. విద్యా ప్రియంకతో పాటు మరో ఐదుగురు అమ్మాయిలు ఓ హాస్టల్లో కలిసి ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు. మరో 15 రోజుల్లో కోచింగ్ పూర్తయ్యేదే! అయితే సోమవారం రాత్రి 9:40 గంటలకు సహ విద్యార్థినులతో విద్యా ప్రియాంక మాట్లాడింది. కొద్దిసేపటికే కోచింగ్ సెంటర్ భవనం పైకి ఎక్కి కిందకు దూకింది.
తీవ్రంగా గాయపడిన ఆమెను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె పిడికిట్లో సూసైడ్ నోట్ లభ్యమైంది శనివారమే విద్యా ప్రియాంక సొంతూరు నుంచి హాస్టల్‌కు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కొన్నిరోజులుగా విద్యా ప్రియాంక ముభావంగా ఉంటోందని, అడిగితే వ్యక్తిగత సమస్యలున్నాయని చెప్పేదని స్నేహితురాళ్లు పేర్కొన్నారు. సూసైడ్ నోట్లో .. ‘నేను తప్పు చేశాను. దాన్ని మరువలేకపోతున్నాను. నా చావుకు నేనే కారణం’ అని ప్రియాంక రాసింది. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.