Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక
కర్ణాటక రాజధాని బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు భారీ వర్షాలతో నగరంలోని రహదారులు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగళూరుతో పాటు చామరాజనగర్, కొలార్ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం సాయంత్రం బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో 45.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు నగరంలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన నల్లూరుహళ్లి మెట్రో స్టేషన్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. స్టేషన్ ప్లాట్‌ఫామ్, టికెట్ కౌంటర్ల వద్ద భారీగా వర్షపు నీరు నిలబడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.