Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు పథకం ద్వారా కేవలం 50 రోజుల్లోనే కోటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా సదాశివపేటలోని కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్ రావు బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. కేక్ కట్ చేసి అక్కడి సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కోటి కంటి పరీక్షలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ రోజు చాలా గొప్ప రోజు అని.. కంటి వెలుగు ద్వారా 29 లక్షల మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందజేశామని తెలిపారు. ప్రజల ఇబ్బందులను గమనించి, కంటి బాధల నుంచి విముక్తి కల్పించేందుకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం తీసుకొచ్చారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ తరహా కార్యక్రమంలో ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఊరు ఊరు వాడకు డాక్టర్లు, యంత్రాలను పంపించి నిరుపేదలకు కంటి వెలుగులు ప్రసాదించారని చెప్పారు. ఈ పథకాన్ని ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, మాన్సింగ్ కూడా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. 50 రోజుల్లోనే కోటి కంటి పరీక్షలు పూర్తి చేశారని అన్నారు. 1500 మంది కంటి వెలుగు టీమ్స్ కష్టపడి పని చేశారని అన్నారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో కంటి వెలుగు పరీక్షలు చేశామన్నారు. 55 శాతం గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేసినట్లు చెప్పారు. దగ్గర చూపుతో ఇబ్బంది పడుతున్న 16.50 లక్షల మందికి, దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న 12.50 లక్షల మందికి కంటి అద్దాలు అందజేశామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో 84 శాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అవుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు తెలిపారు.