Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగర్కర్నూల్
నల్లమల అడవుల్లోని సలేశ్వరం జాతరలో విషాదం చోటుచేసుకుంది. సలేశ్వరం జాతరకు వెళ్లిన ఇద్దరు భక్తులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లాలోని వనపట్ల గ్రామానికి చెందిన భక్తుడు గుండెపోటుతో మృతి చెందగా, వనపర్తి జిల్లాకు చెందిన మరో యువకుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఎన్నడూ రానంత భక్తజనం ఈ ఏడాది సలేశ్వరం జాతరకు తరలివచ్చారు.
ఈ తరుణంలో సలేశ్వరం ఆలయం వద్దకు వెళ్లే దారిలో భక్తులు బారులు తీరారు. మన్ననూర్ నుంచి సలేశ్వరం జాతరకు వచ్చే మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సలేశ్వరం జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమైంది. రేపటి వరకు జాతర కొనసాగనుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.