Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. గుట్టుచప్పుడు కాకుండా వారిని ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్య సేవలు ప్రారంభించారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. మహబూబాబాద్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల (6,7,8,9,10, ఇంటర్ ప్రథమ, ద్వితీయ)లో 378 మంది విద్యార్థులు ఉండగా ఇంటర్ విద్యార్థులు పరీక్షలు కాగానే వారి స్వగృహాలకు వెళ్లిపోయారు. పదో తరగతి చదువుతున్న 66 మంది విద్యార్థులు రెడ్యాల ఆశ్రమ గురుకుల పాఠశాలలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
ఈ నెల 1న కొందరికి కరోనా ఆర్టీపీసీ టెస్టులు నిర్వహించగా, ఒక సెక్యూరిటీగార్డు, మరో విద్యార్థికి పాజిటివ్ రావడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సేవలు ప్రారంభించారు. ఆ తర్వాత మరికొంత మంది విద్యార్థులు ఇదే రీతిన అనారోగ్యానికి గురికావడంతో 51 మందికి ఆర్టీపీసీ పరీక్షలు చేయించారు. వీరిలో 15 మందికి పాజిటివ్ రిపోర్టు 4వ తేదీన వచ్చింది. వీరందరిని గురుకులంలోనే ఓ గది (ఐసోలేషన్)లో ఉంచి పౌష్టికాహారం, మందులు ఇవ్వడం ప్రారంభించారు.