Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రధాని పాల్గొననున్నవి కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కావడంతో ప్రోటోకాల్ ప్రకారం సీఎం, ఇతర ప్రముఖులకు హోదాల ప్రకారం ఆహ్వానించారు. ఈ మేరకు షెడ్యూల్లోనూ చేర్చారు.
ఇందులోభాగంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొనే బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఏడు నిమిషాలు కేటాయించారు. ఇక ప్రధాని రాష్ట్ర పర్యటన కేవలం రెండు గంటల్లోనే ముగియనుంది. శనివారం ఉదయం 11.30కు హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. 1.30 గంటల సమయంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
కొంతకాలం నుంచి ప్రధాని మోడీ పాల్గొంటున్న ఏ ప్రభుత్వ, ఇతర కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. ఇంతకుముందు పలుమార్లు మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినా.. స్వాగతం పలకడానికి సీఎం వెళ్లలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులనే పంపారు. అయితే ఈ నెల 8న పరేడ్‌గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో పరేడ్‌గ్రౌండ్స్ సభలో కేసీఆర్ ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేక గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ మంత్రిని ప్రతినిధిగా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.