Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై: కోచింగ్ సెంటర్లోకి ప్రవేశం నిరాకరించడంతో నీట్ విద్యార్థిని మనస్తాపం చెందింది. రైల్వే స్టేషన్లోకి వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అబతరణపురానికి చెందిన 18 ఏళ్ల నిషా, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కోసం నేవేలిలోని కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నది. గురువారం కోచింగ్ క్లాస్ కోసం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే కోచింగ్ సెంటర్లోకి ప్రవేశం నిరాకరించడంతో మనస్తాపం చెందింది. కోచింగ్ సెంటర్ నుంచి వండలూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఆ స్టేషన్లోకి వస్తున్న రైలు ముందుకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే యువతి రైలు ముందు దూకడాన్ని గమనించిన లోకో పైలట్ రైలును నిలిపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. రైలు కింద పడి చనిపోయిన నిషా మృతదేహాన్ని ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, తన కుమార్తె ఆత్మహత్యకు బైజూస్ కోచింగ్ సంస్థ కారణమని నిషా తండ్రి ఉతిరభారతి ఆరోపించారు. పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులను వేరు చేయడంతో తన కుమార్తె మనస్తాపం చెందిందని తెలిపారు. ‘నా కుమార్తెకు 399 మార్కులు వచ్చాయి. కానీ నైవేలిలోని ఇందిరా నగర్లో ఉన్న బైజూస్ కోచింగ్ సెంటర్లో 400 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను తీసుకొని విడిగా కోచింగ్ ఇవ్వడంతో ఆమె నిరాశ చెందింది’ అని చెప్పారు. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన ఆ కోచింగ్ సెంటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు నిషా మరణంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.