Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను తెలుగులోనూ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఇటీవల సీఆర్పీఎఫ్ ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లో హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లోనే పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం పేర్కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని మరో సారి సమీక్షించుకోవాలని సూచించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు శుక్రవారం కేటీఆర్ లేఖ రాశారు. వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిటీ టెస్ట్ విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు గతంలో కేంద్రం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. సమాన అవకాశాలు పొందేలా దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కాలరాస్తుందని ఆరోపించారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది మంది యువకులపై ఎలాంటి వివక్ష, అసమానత చూపకుండా సమాన అవకాశాలు దక్కేలా సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ ను సవరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు.