Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పాము కరిచిన బాధితురాలు చికిత్స కోసం వస్తే.. ఓ డాక్టర్ చేతికి కట్టువేసి సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన సంఘటన విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితురాలి చేయి ఇన్ ఫెక్షన్ కు గురై చేయి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది.
విస్సన్నపేటకు చెందిన నందిపాము తులసి(24) ఇంటి దగ్గర పనిచేసుకుంటుంటే చేతిపై పాము కరిచింది. వెంటనే ఆమెను విస్సన్నపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. విషం విరుగుడు కోసం ఇంజక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత నూజివీడు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పటికే చెయ్యి నల్లగా మారడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలిని డాక్టర్లు పరీక్షించారు. ఎలాంటి ప్రమాదం లేదని.. విషానికి విరుగుడు ఇచ్చామని చెప్పారు. రెండు రోజులు ఆస్పత్రిలో ఉండాలని సూచించారు. ఆ తర్వాత తులసి చెయ్యి వాచిపోయింది. నొప్పితో ఆమె విలవిల్లాడుతుంది. ఈ సమయంలో డాక్టర్లు పరీక్షించి...విషమంగా ఉందంటూ ఐసీయూలోకి మార్చారు. చేతికి సర్జరీ చేసి అరచేతికి వెనుక వైపు వాచిపోయి ఉన్న భాగాన్ని కోసి తీసేశారు. అనంతరం మోచేతి వరకూ కట్టు కట్టారు. తర్వాత సాధారణ వార్డుకు తరలించారు. రెండు రోజుల తర్వాత డ్రెస్సింగ్ కోసం కట్టు విప్పి చూస్తే.. దానిలోపల బ్లేడ్ కనిపించింది. దీనిపై బాధితురాలి బంధువులు డాక్టర్లను ప్రశ్నిస్తే.. వైద్యాధికారులకు ఈ విషయం తెలియజేస్తామంటూకట్టుకట్టేసి వెళ్లిపోయారు.
చేతికి కట్టిన కట్టు లోపల గుచ్చుకుంటున్నట్లు పలు మార్లు తులసి చెప్పినా..డాక్టర్లు పట్టించుకోలేదని ఆమె భర్త సురేష్, బంధువులు ఆరోపించారు. చేతికి ఇన్ఫెక్షన్ ఎక్కువైందని.. తొలగించాలని వైద్య సిబ్బంది చెప్పినట్లు వివరించారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారని వాపోయారు.