Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మక్తల్
ఓ పదో తరగతి విద్యార్థిని మ్యాథ్స్ ఎగ్జామ్ రాసేందుకు శనివారం మక్తల్‌లోని గర్ల్స్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి వచ్చింది. కానీ ఆ సెంటర్లో ఆమెకు కేటాయించిన హాల్ టికెట్ నంబర్ లేదు. ఆ విద్యార్థినికి నారాయణపేటలోని గర్ల్స్ హై స్కూల్ కేటాయించగా, పొరపాటున ఆమె మక్తల్‌కు వచ్చింది. పరీక్ష ప్రారంభానికి అర గంట సమయమే ఉండటంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు ఈ విషయాన్ని మక్తల్ సీఐకి తెలియజేశాడు. మక్తల్ సీఐ సీతయ్య ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అశోక్.. బాధిత విద్యార్థిని భవానిని తనపై బైక్‌పై 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణపేట గర్ల్స్ హైస్కూల్‌కు 30 నిమిషాల్లో తీసుకెళ్లాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ చొరవతో కానిస్టేబుల్ సాయంతో భవాని తనకు కేటాయించిన సెంటర్లో గణితం పరీక్ష రాసింది. సకాలంలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లిన కానిస్టేబుల్ అశోక్‌ను సీఐ సీతయ్య అభినందించారు. క్యాష్ రివార్డు కింద రూ. 500 నగదు అందజేశారు. సీఐ సీతయ్యను, కానిస్టేబుల్ అశోక్‌ను నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు.