Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బండ్లగూడ
బండ్లగూడ, న్యూస్టుడే: కొడుకు అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు.. సంబంధిత విభాగంలో పని చేస్తున్న అతడి తల్లి అధికారుల ఆదేశం మేరకు విధుల్లో భాగంగా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన ఘటన నాగోల్ డివిజన్ ఫత్తుల్లాగూడలో జరిగింది. ఫత్తుల్లాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కంచె లోపల వరుస సెలవులు నేపథ్యంలో ఓ అక్రమ నిర్మాణం వెలిసింది. ఈ నిర్మాణం ఉప్పల్ మండలం పరిధిలోని ఫత్తుల్లాగూడ గ్రామ వీఆర్ఏ చంద్రకళ కుమారుడే నిర్మిస్తున్నాడని స్థానికులు, చెరువు సమీప కాలనీవాసులు, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ గౌతంకుమార్కు ఫొటోలు ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. విచారించిన తహసీల్దార్ శనివారం కుమారుడు కట్టిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని అక్కడ కావలదారుగా విధులు నిర్వహిస్తున్న తల్లి చంద్రకళను ఆదేశించారు. దీంతో ఆమె నిర్మాణాన్ని కూల్చివేసింది.
కొడుకు కట్టిన అక్రమ నిర్మాణాన్ని తల్లి పాక్షికంగానే కూల్చివేసినట్లు గ్రామస్థులు విమర్శిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ గౌతంను వివరణ కోరగా సోమవారం తానే స్వయంగా పరిశీలించి పూర్తిగా కూల్చివేయిస్తానన్నారు. అక్రమ నిర్మాణంపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ నివేదిక ఇవ్వగానే నిర్మాణం చేపట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.