Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత వైభవాన్ని తీసుకురావాలి
నవతెలంగాణ - హైదరాబాద్
సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సంయుక్త సమావేశం ప్రారంభమైంది. సీపీఐ(ఎం) , సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు అధ్యక్ష వర్గంగా సభను నడుపుతున్నారు. ఈ సభలో ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ చెబుతున్న అభివృద్ధి మాటల్లో తప్ప చేతల్లో లేదని తెలిపారు. ప్రజల సొమ్ముతో చేస్తున్న కార్యక్రమాలు ఆర్భాటంగా ప్రారంభిస్తూ.. నేను తప్ప ఎవరూ చేయలేరని మోడీ ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏ ప్రధానమంత్రి ఇలా చేయలేదు. ఈ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు తాజా ఉదాహరణ మొన్నటి వరకు జరిగిన పార్లమెంటు సమావేశాలు చూస్తే తెలుస్తుందని తెలిపారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తిప్పికొట్టేందుకు మన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలపై ఉంది. తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఒక ముందడుగు వేసి ఈ గొప్ప కలయికను శాఖ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం గొప్ప విషయం. అందుకు చొరవ చేసిన తెలంగాణ రాష్ట్ర కమిటీలకు జాతీయ పార్టీ తరపున అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శులు కె నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆ రెండు పార్టీల మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతోపాటు ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులంతా పాల్గొంటారు. ఇలాంటి సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అందుకే ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. సీపీఐ, సీపీఐ(ఎం) మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాయకులు పాల్గొన్నారు.