Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మోడీని గద్దె దింపితేనే దేశానికి రక్షణ అని, అందుకోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ లౌకిక శక్తులను ఏకం చేయాలని సీపీఐ(ఎం) నేత ఏచూరి సీతారాం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం, సీపీఐ ఉమ్మడి సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ తరుణంలో కమ్యునిస్టు ఉద్యమానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ సీపీఎం, సీపీఐ చేస్తున్న కృషి అభినందించారు.
తెలంగాణలో మొదలైన ఈ ఐక్యత దేశానికి దిక్సూచిగా ఉంటుందని, లౌకిక శక్తులన్నీ ఏకమయ్యేందుకు దోహదపడుతుందని ఆకాంక్షించారు. బీజేపీ మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. మోడీ చెబుతున్న అభివృద్ధి మాటల్లో తప్ప చేతల్లో లేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతో చేస్తున్న కార్యక్రమాలు ఆర్భాటంగా ప్రారంభిస్తూ నేను తప్ప ఎవరూ చేయలేరని మోడీ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణానికి సమాధానం చెప్పకుండా పార్లమెంట్‌ను కేంద్రం అడ్డుకుందన్నారు.