Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థులకు సోమవారం కీలకమైన సైన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం విద్యార్థులకు రెండు ఓఎమ్మార్ షీట్లు, ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలు అందజేస్తారు. ఈ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు, టీచర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే లింగయ్య సూచించారు. భౌతికశాస్త్రం పేపర్‌కు సైన్స్ పేపర్-1 (19), జీవశాస్త్రం పేపర్‌పై సైన్స్ పేపర్-2 (20) అని రాసి, వేరుగా ప్యాక్ చేయాలని ఆదేశాలిచ్చారు. పదో తరగతి పరీక్షలకు గతంలో 11 పేపర్లు ఉండగా, ఈ విద్యాసంవత్సరం నుంచి 6 పేపర్లు పెట్టారు. అయితే సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించడం, ఇద్దరు ముల్యాంకనం చేయాల్సి ఉండటంతో ఈ రెండు పేపర్లకు ఒకే రోజు వేర్వేరుగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. మిగతా పేపర్లకు 3 గంటల పాటు నిర్వహించగా, సైన్స్ పరీక్షను మాత్రం 3.20గంటల పాటు నిర్వహిస్తారు. ఇక ఫిజికల్ సైన్స్ పేపర్, జీవశాస్త్రం పేపర్ల మార్పిడి కోసం 20 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించగా, ఇందు కోసం కేటాయించిన 11 గంటల నుంచి 11.20 గంటల వరకు విద్యార్థులు పరీక్షాకేంద్రాల్లోనే ఉండేలా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ పరీక్షల సమయాల్లో ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంట్ టీచర్లు పరీక్షాకేంద్రాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు ముందుగా ఫిజికల్ సైన్స్ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఇక ఉదయం 10.45 గంటలకు పార్ట్-బీ పేపర్ ఇస్తారు. మొత్తం ఆన్సర్‌షీట్లను సరిగ్గా 11 గంటలకు విద్యార్థుల నుంచి తీసుకుంటారు. ఫిజికల్ సైన్స్ ఓఎమ్మార్ షీట్, సమాధాన పత్రాలను కలిపి ట్యాగ్ చేయాలి.
ఉదయం 11 గంటల నుంచి 11.20 నిమిషాల వరకు ఫిజికల్ సైన్స్ పేపర్లను అప్పగించడం.. జీవశాస్త్రం పేపర్లను విద్యార్థులకు అందజేసేందుకు అదనంగా కేటాయించారు.
ఇక జీవశాస్త్రం పేపర్‌కు ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. పార్ట్-బీ పేపర్‌ను 12.35 గంటలకు ఇచ్చి, 12.50 గంటలకు రెండు పేపర్లను విద్యార్థుల నుంచి తీసుకుంటారు. జీవశాస్త్రం ఓఎమ్మార్, ఆన్సర్‌షీట్లను కలిపి ట్యాగ్ చేయాలి.