Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
డబ్బుల కోసం ఇంట్లోకి చొరబడిన ఓ యువకుడు ఓ వృద్ధురాలిపై దాష్టీకం ప్రదర్శించాడు. నోట్లో వస్త్రం కుక్కి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేసి, సెల్ఫీ వీడియో తీసుకుని రాక్షసానందం పొందాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని ఇస్తాళపురంలో జరిగిందీ ఘోరం. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన కప్పల విజయ్(25), సూర్యాపేటలోని ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ నెల 8న వృద్ధురాలి ఇంట్లో దొంగతనం చేసి, డబ్బులు తెస్తానని, ఇంటి ఎదుట కాపలాగా ఉండాలని ఖాలేందర్కు చెప్పి, విజయ్ లోపలికి వెళ్లాడు. తలుపులను కాళ్లతో తన్ని, ఇంట్లోకి ప్రవేశించి, వృద్ధురాలి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకోగా.. నోట్లో వస్త్రం కుక్కి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ తతంగం మొత్తం తన సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటనలో ఊపిరి ఆడక వృద్ధురాలు మృతి చెందింది. ఆ తర్వాత ఆమె ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు, ఐదు వేల నగదు తీసుకుని, విజయ్ బయటకు వచ్చాడు. ఉదయం కలిసి డబ్బులు ఇస్తానని చెప్పి, ఖాలేందర్ను పంపించాడు. అపహరించిన ఆభరణాలను 9న సూర్యాపేటలో తాకట్టు పెట్టి, రూ.1.90 లక్షలు రుణం తీసుకున్నాడు. అనంతరం రూ.48 వేలు చెల్లించి పల్సర్ బైక్ను కొనుగోలు చేశాడు. రూ.10వేలతో కొత్త దుస్తులు, ఏడు వేలతో మద్యం కొనుగోలు చేసి, తన మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా తిరిగి గ్రామానికి వెళ్లాడు. హత్య జరిగిన రోజు నిందితులిద్దరూ గ్రామంలో తిరిగినట్లుగా గుర్తించిన పోలీసులు.. 10న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించారు.