Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా భయం మళ్లీ మొదలైంది. అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. గతంలో కంటే ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. అకస్మాత్తుగా భారీగా కేసులు నమోదు అయితే ఆందోళన చెందకుండా చికిత్స అందించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై మాక్‌డ్రిల్‌ను నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం గాంధీ ఆస్పత్రిలో మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ రమేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవిడ్ కేసులు ఎక్కువగా వస్తే, చికిత్స అందించేందుకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఆస్పత్రి వైద్యులు మీడియాకు చూపించారు. ఒకే రోజు ఐదు వేల కేసులు వచ్చినా చికిత్స అందించే సామర్థ్యం కలిగిన ఆక్సిజన్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వివరించారు. అత్యవసర పరిస్ధితిలో ప్రస్తుతం 40 బెడ్లను ఏర్పాటు చేసి, సిద్ధంగా ఉంచామన్నారు. గాంధీలో రోగులకు 2,000 బెడ్లు ఉన్నప్పటికీ 1,890 బెడ్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయన్నారు. ఐసీయూ వార్డులో 600 బెడ్లు, 650 సాధారణ బెడ్లు, అదనంగా మరో 600 బెడ్లు కొవిడ్ చికిత్స కోసం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రిలో 300 బి టైప్ సిలిండర్లు, 585 వెంటిలేటర్లు ఉండగా, ఇందులో 530 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు.