Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : స్వల్ప కాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించడం అద్భుతమని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని తెలిపారు. దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపును ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ సంబరాలు చేసుకున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, జాతి వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నందుకు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశ ప్రగతిని అడ్డుకోవాలని కోరుకునే దేశ వ్యతిరేక శక్తులంతా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జైలులో ఉన్న ఆ పార్టీ నేతలు సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాలను గుర్తు చేశారు. జైలుకు వెళ్లడానికి భయపడేవారు పార్టీని వదిలిపెట్టాలన్నారు. భారత దేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తమ పార్టీలో చేరాలని ప్రజలను కోరారు. తమకు దేవుని మద్దతు ఉందన్నారు. నిఖార్సయిన నిజాయితీ, దేశభక్తి, మానవత్వం తమ పార్టీకి మూడు స్తంభాలని చెప్పారు.