Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీక్షను ప్రారంభించిన జాన్ వెస్లీ,కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు,
- ముగించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి.
నవతెలంగాణ - హైదరాబాద్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ),భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో స్థానిక బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థి,నిరుద్యోగ మహా దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి,డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అధ్యక్షత వహించారు .విద్యార్థి, నిరుద్యోగ మహా దీక్షను కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, డివైఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జాన్ వెస్లీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
టీఎస్ పీఎస్సీ ఏఈ,గ్రూప్-1 పేపర్లు లీకై రాష్ట్రంలో విద్యార్థి,నిరోద్యోగ యువత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనౌతుంటే వారికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించరా అని ప్రశ్నించారు.టీఎస్ పీఎస్సీలో 30 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వీరందరిలో ఈ లీకేజీతో చదివితే ఉద్యోగం వస్తుందో, రాదోనన్న అభద్రతాభావం ఏర్పడిందన్నారు.ఉద్యోగ నియామకాలు చేపట్టే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే 450 పై చిలుకు ఉద్యోగాలు అవసరం ఉంటే కేవలం 80 ఉద్యోగాలతో కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు.
ఎస్ఎఫ్ఐ,డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు టి.నాగరాజు,అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతాయనీ ముఖ్యమంత్రి స్పందించే వరకూ తమ పోరాటం ఆపబోమన్నారు.లీకేజీపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,లీకేజీ వలన నష్టపోయిన ప్రతీ నిరుద్యోగ యువతకు ప్రతీ నెలకు 20000 ఇవ్వాలనీ, రాష్ట్రంలో ప్రతీ యేటా ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించి నియామకాలు పకడ్బందీగా చేపట్టాలన్నారు.వరుస పోటీ పరీక్షల మరియు పదవ తరగతి పేపర్ లీకేజీలలో రాజకీయ కుట్ర కోణంలోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతీ నిరుద్యోగి ఖాతాలో 50 వేలు జమచేయాలి.
- అలుగుబెల్లి నర్సిరెడ్డి,టీచర్ ఎమ్మెల్సీ
ఖమ్మం,నల్గొండ,వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సాయంత్రం దీక్షా శిబిరానికి హాజరై మహాదీక్షను విరమించారు.మహాదీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ నిరుద్యోగి ఖాతాలో 50వేల రూపాయలు జమ చేయాలని అన్నారు.ఇది విద్యార్థి,నిరుద్యోగులు తమ భవిష్యత్ కార్యాచరణలో డిమాండ్ గా పెట్టాలని సూచించారు.పబ్లిక్ సర్వీస్ కమీషన్ పట్ల తెలంగాణ యువత విశ్వాసం కోల్పోయారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు
ఎస్. వీరయ్య, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి,రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శోభన్ నాయక్, టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఎ విజయ్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు యాదగిరి,సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర,అధ్యక్షులు వలివుల్లా ఖాద్రి,పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్ ప్రదీప్, పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం నాయక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు మమత, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం, రజనీకాంత్, కిరణ్, బి.శంకర్,మిశ్రీన్,శ్రీకాంత్ వర్మ, వీరభద్రం, అశోక్, దాసరి ప్రశాంత్, కె.ప్రశాంత్, వనం రాజు, బషిర్, నవీన్, జి.వెంకటేష్, మహేష్, కృష్ణ, నరేష్, తిరుపతి, జావేద్, హరికృష్ణ , హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హస్మీ బాబు, లెనిన్, స్టాలిన్, వీరేంద్ర, అనూష తదితరులు పాల్గొన్నారు.