Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రత్యర్థులను చూసి తాము బెదిరిపోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విపక్షాలను భయపెట్టలేమన్న వాస్తవాన్ని బీజేపీ అర్థం చేసుకోలేకపోవడం ఆశ్చర్యకరమని చెప్పుకొచ్చారు. లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసినా, ఎంపీ అనే పేరును తీసేసుకున్నా, జైల్లో వేసినా.. కేరళలోని వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని రాహుల్ పేర్కొన్నారు. లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన అనంతరం తొలిసారి తన నియోజకవర్గంలో పర్యటించిన రాహుల్.. బీజేపీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ వేదికగా బీజేపీ మంత్రులు తనపై అబద్ధాలు చెప్పారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై సమాధానం చెప్పేందుకు మాత్రం తనను అనుమతించలేదని అన్నారు. స్పీకర్ వద్దకు వెళ్లినా లాభం లేకపోయిందని చెప్పారు. 'మీరు నాపై ఎంతగా మాటల దాడికి దిగినా.. నేను వెనక్కి తగ్గను. నేను మాట్లాడుతూనే ఉంటా'అని రాహుల్ స్పష్టం చేశారు.